మహబూబ్నగర్/సూర్యాపేట, వెలుగు: నారాయణపేట, సూర్యాపేట జిల్లాల్లో వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. నారాయణపేటలో ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో 800 మంది పోలీసులు డ్యూటీలో ఉంటారు. డీజే నిర్వాహకులు, రౌడీషీటర్లు, కమ్యూనల్ షీటర్లను బైండోవర్ చేశామని, శోభాయాత్రల్లో డీజేలను పూర్తిగా నిషేధించినట్లు ఎస్పీ తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో ఎస్పీ కే.నరసింహ ఆదేశాల మేరకు 1,200 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టి, నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, ఫ్లడ్లైట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. రెండు జిల్లాల్లోనూ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడంతోపాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీలు హెచ్చరించారు.
